ఫొటోగ్రఫీలో ఆధునికతకు అవకాశం
విజయవాడ (వి.వి.): రోజురోజుకూ ఫొటోగ్రఫీ రంగం విస్తరిస్తున్న నేపధ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత నాణ్యతా ప్రమాణాలతో ఫొటోలు తీయాల్సిన అవసరం వుందని సెంట్రల్ ఎం.ఎల్.ఎ. మల్లాది విష్ణు
పేర్కొన్నారు. ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే ఇన్‌స్టిట్యూట్ హాలులో ఆదివారం రాష్ట్ర స్థాయి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్‌షాప్ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మల్లాది విష్ణు ప్రసంగిస్తూ కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే వివాహవేడుకలకు ప్రత్యేక స్థానం వుందన్నారు. అలాగే ఆధునిక టెక్నాలజీలో ఎంతోమంది ఫొటో, వీడియో వృత్తితో జీవిస్తూ నాణ్యతలో ఎవరికీ తీసిపోని విధంగా ఎదిగారన్నారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ వర్క్‌షాప్‌కు ఫ్యాకల్టీగా విచ్చేసిన ప్రముఖ కొడాక్ కంపెనీ ఫొటోగ్రాఫర్ కె. విశ్వేందర్‌రెడ్డి, ప్రకటన రూపకర్త కె. సుధాకరరెడ్డిలు వారి వారి అభిప్రాయాలను ఫొటో, వీడియో గ్రాఫర్ల ప్రవర్తన ఏ విధంగా వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుందో వివరించి, నిజంగా పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎలా కవర్ చేయాలనేదానిపై ప్రత్యక్షంగా వేదికపై ప్రదర్శన నిర్వహించి చూపించారు. ఈ సన్నివేశం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల నుండి దాదాపుగా 600 మంది హాజరయ్యారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు తాండవ కృష్ణ అధ్యక్షత వహించారు. సెక్రటరీ కొడాక్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ టి. జానకిరామ్ అసోసియేషన్ న్యూస్ బులిటెన్‌ను, ఫొటోగ్రఫీ డైరీని ఆవిష్కరించారు. ఐదుగురు ప్రతిభా మూర్తులను అసోసియేషన్ లైఫ్ మెంబర్‌షిప్‌తో సత్కరించారు.
No comments:
Post a Comment